నటుడి గా నా వయస్సు ఎనిమిదేళ్ళే : ఉదయ్ కిరణ్
నటించిన మొదటి మూడు చిత్రాలూ సూపర్ డూపర్ హిట్ లు కావడం తో ఒక్కసారిగా తారా పధం లోనికి దూసుకు పోయిన ఉదయ్కిరణ్ జన్మదినం ( 26th june ) సందర్భంగా ఆయనతో జరిపిన చిట్ చాట్ . . .
ముందుగా మీకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు . . .
Thank you very much అండీ . . .
ప్రస్తుతం మీరు చేస్తున్న చిత్రాల గురించి చెప్పండి . .
ప్రస్తుతం నేను రెండు చిత్రాలు చేస్తున్నాను. ఒకటి పరచూరి ప్రసాద్ మదన్ దర్శకత్వం లో నిర్మిస్తున్న "గుండెజల్లుమంది", ఇంకొకటి మేడికొండ మురళీకృష్ణ కె.ఆర్.కె. దర్శకత్వంలో నిర్మిస్తున్న ఏకలవ్ యు డు. రెండు చిత్రాలూ దాదాపు గా పూర్తి అయిపోయాయి. గుండెజల్లుమంది చిత్రం ప్రస్తుతం విడుదలకు సిద్దమవుతుంది.
గుండెజల్లుమంది గురించి చెప్పండి . . .
నేను చాలా చాలా ఎదురు చూస్తున్న చిత్రం ఇది. షూటింగ్ మొదలు పెట్టిన దగ్గరనుండీ ఒక పాజిటివ్ ధృక్పధం తో వెళుతున్న చిత్రం ఇది. మదన్ గారితో నాకు ఒక సంవత్సరం గా పరిచయం వుంది. చిత్రం మొదలు పెట్టకముందే మేము చాలా సార్లు కలుసుకొన్నాం. దానివల్ల మా ఇద్దరిమధ్యనా ఒక చక్కని ర్యాపో ఏర్పడింది. నిజానికి మదన్ అంటే ఒక చక్కని కుటుంభ కధా చిత్రాలు చేస్తారు అన్న పేరు వుంది, మరి నాతో యూత్ ఫుల్ గా చిత్రాన్ని తీయగలరా అని నాకు గానీ, ఉదయ్ కిరణ్ కి వున్న లవర్ బోయ్ ఇమేజ్ తో నా సినిమాకి నప్పుతాడా, అసలే సక్సస్ లో కూడా లేడు అని మదన్కి గానీ ఎప్పుడూ లేదు. ఈ కధ అనుకొన్నప్పటి నుండీ ఈ చిత్రాన్ని నాతోనే తీయాలనుకొన్నారాయన. ఇప్పుడు అంతా అయ్యిన తర్వాత చూసుకొంటే మా యూనిట్ మొత్తం చాలా చాలా సంతోషంగా వున్నాం. వ్యాపార వర్గాల్లో కూడా మా మూవీ గురించి మంచి టాక్ వుంది. So అన్ని రకాలు గానూ ఈ చిత్రం నాకు హెల్ప్ ఫుల్ గా వుంటుంది అనడం లో నాకు ఏ మాత్రం సందేహం లేదు.
ఈ చిత్రం లోని హైలైట్స్ చెప్పండి . . .
గుండె జల్లు మనడం అనేది ఒక భావన. ఆ భావనకు ఒక అందమైన చిత్ర రూపమే మా యీ చిత్రం. చూసిన ప్రతిఒక్కరూ ఒక చక్కని ఫీలింగ్ కి గురిఅవుతారు. ఇక ఈ చిత్రానికి కీరవాణి గారు సంగీతాన్ని అందిస్తున్నారు. నిజానికి ఆయనతో ఒక్క చిత్రం లో అన్నా పని చేయాలన్నది నాకు ఎప్పటి నుండో కోరిక. అది ఇన్నాళ్ళకు తీరుతుంది. మొదటి నుండీ నాకు ఆయన సంగీతం అంటే చాలా చాలా ఇష్టం. అలాంటిది ఈ రోజు ఆయనే నా చిత్రానికి సంగీతం అందిస్తున్నారు అంటే అంతకన్నా సంతోషించాల్సిన విషయం ఇంకేముంటుంది నాకు. ఇక మదన్ గురించి నేను ఈ రోజు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఒక ఆ నలుగురు గానీ, పెళ్ళి అయిన కొత్తలో గానీ చాలు ఆయన ఒక చక్కని దర్శకుడు అని చెప్పడానికి. ఈ చిత్రం కోసం ఆయన చక్కని కధను తయారు చేసుకొన్నారు. ముఖ్యంగా పాత్ర ల చిత్రీకరణ ఇందులో
చాలా బావుంటుంది. అలాగే చెప్పాలనుకొన్న విషయాన్ని వినోదాత్మకంగా చక్కని కధనం తో చెప్పగలగడం మదన్ కి బహుశా వెన్న తో పెట్టిన విద్య అనుకొంటా. వచ్చిన ప్రేక్షకుడిని ఏ మాత్రం ఈ చిత్రం నిరాశ పరచదు అని మాత్రం నేను ఖఛ్చితం గా చెప్పగలను.
మీ కెరీర్ చాలా గొప్పగా ప్రారంభం అయ్యింది . . కానీ ఆ తర్వాత మీకు చెప్పుకో దగిన విజయాలు రాలేదు . . . మీ వుద్దేశ్యం లో అలా ఎందుకు జరిగిందనుకొంటున్నారు . .
నిజమే . . . దానికి చాలా చాలా కారణాలు వున్నాయి. అయితే ఈ విషయంలో నేను ఎవరినీ బ్లేమ్ చేయను. ఎవరికైనా కెరీర్ ప్రారంభం మామూలు గా వుంటే తర్వాతి విషయాలు నెమ్మదిగా చూసుకొంటారు. నా విషయం లో బ్యాక్ టు బ్యాక్ విజయాలు రావడం వల్ల నేను కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకొన్నాననే చెప్పాలి. దానికి తోడు నాకు మొదటి నుండీ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ లేదు, నాకంటూ ఏ గాడ్ ఫాదరూ లేరు. నా నిర్ణయాలు నేనే తీసుకోవాల్సి
వచ్చేది. అప్పటికీ కధ విషయం లో నేను యెప్పుడూ కాంప్రమైజ్ కాలేదు. నేను చేసిన ప్రతి చిత్రం కధల పరం గానో లేక మరో రకం గానో సినిమా మొదలు అవ్వకముందు బాగుండేవి. అయితే వాటి ఎక్జిక్యూషన్ లోనే తేడాలు వచ్చేవి. అయితే ఒకటి మాత్రం చెప్పగలను, అలా అయిన ప్రతి వాటి నుండీ నేను ఎన్నో పాఠాలు నేర్చుకొన్నాను. ప్రతీదీ నాకు తర్వాత నేను ఏం చెయ్యకూడదో నేర్పింది. అయితే హ్యూమన్ ఎర్రర్స్ అన్నవి మామూలే కదా. అయితే ప్రేక్షకుల్లో నాకంటూ వున్న క్రెడిబిలిటీ ని మాత్రం నేను పోగొట్టుకోలేదు అనే చెప్పాలి.
మీరు ఒక పూర్తి స్థాయి action హీరో గా చేసిన శ్రీరామ్ చిత్రంపెద్ద విజయాన్ని సాధించక లేక పోయినా ఒక మంచి చిత్రమే అన్న పేరు తెచ్చుకొంది. మరి ఆ తర్వాత మీరు అటువంటి చిత్రాల జోలి కి యెందుకని వెళ్ళలేదు . . .
నిజానికి I Love to do action films అండీ, బట్ నేను పేద్ద మాస్ హీరో లో
పూర్తి ఏక్షన్ చిత్రం చేస్తాను అంటే కుదరదు, కుదరదు ఏంటి చూడరు కూడా, నిజానికి శ్రీరామ్ చిత్రం కూడా out and out action film ఏం కాదు. అయినా అది అంతగా ఆదరణ పొందక
పోవడానికి కారణం, ప్రేక్షకులు నన్నుఆ విధంగా చూడడానికి సిద్దం గా లేకపోవడమే అని నా అభిప్రాయం. అలాగే నేను ఇటీవల చేసిన లక్ష్మీపుత్రుడు చిత్రాన్ని కూడా సరిగా ప్రెజెంట్ చేయలేదు. అది ఒక తెలుగు చిత్రం అనీ, ఉదయ్ కిరణ్ చిత్రం అనీ వెళ్ళిన వాళ్ళకి అది ఒక డబ్బింగ్ ఫిల్మ్ అని అనిపించడం వల్లనే అది ఫెయిల్ అయ్యింది. కానీ నేను ఏక్షన్ వున్న చిత్రాలు మాత్రం సమీప భవిష్యత్ లో డెఫినెట్ గా చేస్తాను.
సాధారణం గా మీ జన్మదినాన్ని ఎలా జరుపుకొంటూ వుంటారు . . . ఈ సారి birthday special ఏంటి . . .
నేను పెద్ద గా సెలెబ్రేట్ చేసుకోను, కానీ ఈ సారి గుండెజల్లుమంది యూనిట్ అందరితోనూ సెలెబ్రేట్ చేసుకో బోతున్నాను. ఈ సారి స్పెషల్ ఏంటి అంటే . . . నాకు
గుండె జల్లుమంది ఒక మంచి విజయాన్ని ఇవ్వనుంది అన్న విషయమే . . .
మీ తరువాతి చిత్రం గురించి కొంచం
చెప్పండి.
గుండె జల్లుమంది చిత్రం ఒకలాంటిది అయితే ఏకలవ్యుడు చిత్రం ఒకలాంటిది. మొదటి దాన్లో అందరూ వెల్ ఎష్టాబ్లిష్ అయిన వారు అయితే, రెండవదానికి అందరూ కొత్తవాళ్ళే. గుండెజల్లుమంది కి కీరవాణి లాంటి వారు సంగీతాన్ని అందిస్తే, ఏకలవ్యుడి కి అనిల్ అని కొత్త సంగీత దర్శకుడు సంగీతాన్ని అందించాడు. అయితే నేను ఇక్కడ ఘంఠాపధం గా ఒక్క విషయం చెప్పగలను, ఏకలవ్యుడు చిత్ర దర్శకుడు కె.ఆర్.కె. గానీ, సంగీతాన్నిచ్చిన అనిల్ గానీ డెఫినెట్ గా సమీప భవిష్యత్ లో గొప్ప దర్శకులవుతారు అనడంలో నాకు ఎటువంటి సందేహాలూ లేవు. ముఖ్యంగా ఏకలవ్యుడు చిత్రం కధని నమ్ముకొని చేస్తున్న చిత్రం, ఒక చక్కని కధ కు అంతే చక్కని కధనాన్ని జోడించి దర్శకుడు తెరకెక్కించిన విధానం నిజంగా చాలా బావుంది. ఈ రెండు చిత్రాలు మళ్ళీ నా కెరీర్ గ్రాఫ్ ని పైకి తీసుకు వెళతాయి అని నేను కాన్ఫిడెంట్ గా చెప్పగలను.
మీరు ఎక్కువగా ఎటువంటి పాత్రలు చేయడానికి ఇష్టపడతారు . .
అలా అని ఏం లేదు. బేసిక్ గా నేను నటుడి ని, నటన అంటే నాకు ఇష్టం. కధ బావుంది అనుకొంటే ఆ పాత్ర ఎలాంటిది అన్నా చేయవచ్చు. నాకు ఏదో ఒక ఇమేజ్ చట్రం లో ఇరుక్కొవాలని లేదు. ఒక లవర్ బోయ్ గానో లేక మరొక విధం గానో నేను అందరినీ రీచ్ అవ్వలేను. నేను అనుకోవడం బాగా పల్లెటూర్ల లో నన్ను చూస్తే ఉదయ కిరణ్ అని గుర్తు పట్టారేమో, నేను అక్కడికి కూడా రీచ్ అవ్వాలి. అప్పుడే నటుడి గా నా లక్ష్యం నెరవేరినట్లు. నేను ఎప్పుడూ మొదటి ప్రాధాన్యత నటన కే ఇస్తాను, తర్వాతే మిగతా ఏవన్నా
. . .
O.K. ఉదయ్ కిరణ్ గారూ . . . మీరు ఈ సంవత్సరం
లో మంచి విజయాలను చవి చూడాలనీ, మరిన్ని మంచి చిత్రాలు చేయాలని ఆశిస్తూ, మా తరపునా, మా విజిటర్స్ తరపునా మీకు మరొక్క సారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.
Thank you very much and keep watching my movies . . .